Jayashankar Bhupalpally District: పెద్దాపూర్‌ గ్రామంలో కుల ‘పంచాయతీ’...మద్దతివ్వలేదని వెలేశారు

  • సర్పంచ్‌ అభ్యర్థితో రూ.8 లక్షలకు ఓ సామాజిక వర్గం ఒప్పందం
  • దీనిని కాదన్న వారిని కులం నుంచి బహిష్కరణ
  • కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు

పంచాయతీ ఎన్నికల వేళ ఓ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ తాము తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించారన్న అక్కసుతో కులపెద్దలు ఏకంగా వారిని సామాజికంగా వెలివేశారు. తెలంగాణ రాష్ట్రం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కులపెద్దల తీర్పుపై బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బాధితుల ఫిర్యాదుల మేరకు వివరాల్లోకి వెళితే... ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రామానికి చెందిన ఒక సామాజిక వర్గం కులపెద్దలు ఓ సర్పంచ్‌ అభ్యర్థితో ఒప్పందం చేసుకున్నారు. తమ సామాజిక వర్గం వారు పంచాయతీలో ఎక్కువగా ఉండడంతో అందరితో నీకే ఓట్లు వేయిస్తామని చెప్పి ఇందుకు అతని వద్ద నుంచి రూ.8 లక్షలు తీసుకున్నారు. గ్రామానికి చెందిన గట్టు లక్ష్మణ, ఊరుగొండ సుధాకర్‌, ఊరుగొండ నరేష్‌, గండి కలమ్మ తదితరులు తామీ ఒప్పందాన్ని అంగీకరించడం లేదని పెద్దలకు స్పష్టం చేశారు.

దీంతో కక్షగట్టిన కులపెద్దలు ఎన్నికలు ముగిసిన అనంతరం వారిని కులం నుంచి వెలివేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో జరిగే ఏ శుభకార్యానికి వీరిని పిలవ కూడదని, వారింట్లో జరిగే కార్యక్రమాలకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. దీంతో బాధితులంతా న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను ఆశయ్రించారు. తమ కులం వాళ్లు బలపరిచిన అభ్యర్థే సర్పంచ్‌గా గెలుపొందడంతో కుల పెద్దలతోపాటు అతను కూడా దౌర్జన్యం చేస్తున్నాడని కలెక్టర్‌ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.

More Telugu News