Andhra Pradesh: కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ పై చంద్రబాబు ప్రశంసలు.. విభజన చట్టానికి ఆయన ఆర్కిటెక్ట్ అని వ్యాఖ్య!

  • కేంద్ర మంత్రులు ఆయనతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు
  • అయినా ఏపీ కోసం నాతో కలిసి ఢిల్లీలో తిరిగారు
  • మోదీపై దేశమంతా దాడిచేయబోతోంది

ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా రూపొందించిన బిల్లుకు కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆర్కిటెక్ట్ గా వ్యవహరించారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా ఆయన చేర్చారని అన్నారు. అంతేకాకుండా, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక, తాను ఢిల్లీకి వచ్చినప్పుడు ఏపీకి ఇచ్చిన హామీల అమలు కోసం జైరామ్ రమేశ్ తనతో పాటు కేంద్ర మంత్రులందరినీ కలిశారని గుర్తుచేసుకున్నారు.

ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు మాట్లాడారు. అప్పట్లో జైరామ్ రమేశ్ పట్ల చాలామంది కేంద్ర మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనీ, అయినా దాన్ని రమేశ్ పట్టించుకోలేదని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలు అమలు అయ్యేలా చూడటం తన బాధ్యత అని జైరామ్ రమేశ్ అప్పట్లో చెప్పారన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించినందుకు ఆయనకు ఏపీ సీఎం ధన్యవాదాలు తెలిపారు. జైరామ్ రమేశ్ భార్య ఇటీవల చనిపోయారనీ, అయినప్పటికీ ఆయన ధర్మపోరాట దీక్షకు వచ్చి తన సంఘీభావాన్ని తెలియజేశారని అన్నారు.

ఇందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి సంఘీభావంపైనే ఈరోజు ప్రధాని మోదీ దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా ఒక్కటై ప్రధాని మోదీపై దాడిచేసే రోజు వస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. అదే నరేంద్ర మోదీ రాజకీయ జీవితానికి ముగింపు అవుతుందని స్పష్టం చేశారు.

More Telugu News