Andhra Pradesh: ప్రధాని వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదు.. ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతు ఇస్తున్నాం!: ఫరూక్ అబ్దుల్లా

  • మోదీపై మండిపడ్డ ఎన్సీ అధినేత
  • విభజన హామీలు అమలుచేయాలని డిమాండ్
  • చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు పూర్తి మద్దతు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ నేతలు, ప్రజాసంఘాలు ఈరోజు ఢిల్లీలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు జాతీయ నేతలు చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్దతు ప్రకటించారు. ఈ దీక్షకు హాజరైన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కేంద్రంపై మండిపడ్డారు.

పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపారు. ధర్మం తప్పినప్పుడే ఆందోళన మొదలవుతుందనీ, అందుకే ఏపీ ప్రజలు ఇక్కడకు వచ్చారని అన్నారు. ఓట్ల కోసం కేంద్రం కులాలు, మతాలను విభజించి పాలించాలని చూస్తోందని మండిపడ్డారు.

ఈ ప్రభుత్వం పోతేనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి వ్యక్తిగత దూషణలకు దిగజారకూడదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News