Vijayashanthi: 'రాజమౌళి ఆర్ఆర్ఆర్'ను బీట్ చేయనున్న 'కేసీఆర్ ఆర్ఆర్ఆర్'... విజయశాంతి ట్వీట్లు!

  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయశాంతి
  • కేసీఆర్ రీజనల్ రింగ్ రోడ్ పై సెటైర్లు
  • మంత్రి పదవి కావాలంటే రిస్క్ తప్పదని విమర్శలు

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన కాంగ్రెస్ నాయకురాలు, సీనియర్ నటి విజయశాంతి, ఇప్పుడు రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్'ను ప్రస్తావిస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని వరుస ట్వీట్లు చేశారు. కేసీఆర్ ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"రాజమౌళి దర్శకత్వం వహించే 'RRR' చిత్రానికి వచ్చే కలెక్షన్లను అధిగమించే విధంగా కేసీఆర్ గారు కొత్త 'RRR' ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ కేసీఆర్ గారి 'RRR' ఏమిటంటే రీజనల్ రింగ్ రోడ్" అని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఆపై "ఈ 'RRR' కు, తెలంగాణ కేబినెట్ విస్తరణలో జరిగే ఆలస్యానికి ఒక లింక్ ఉందని తెరాస నేతలు చెబుతున్నారు. కేసీఆర్ గారి కేబినెట్ లో చేరడమంటే మంత్రులుగా ప్రమాణం చేసేవారు కొంత రిస్క్ చేయక తప్పదని తెలుస్తోంది" అన్నారు.

అంతటితో వదలని రాములమ్మ, "కేసీఆర్ గారి కేబినెట్ లో చేరబోయే వారికి విధించబోయే షరతులు ఏమిటంటే... తెరాస ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ పేరుతో చేయబోతున్న లక్ష కోట్ల కుంభకోణానికి, మంత్రులు ఆమోదముద్ర వేయడంతో పాటు దానికి పూర్తి భాద్యత వహించాలి. రేపు ఏమైనా చట్టపరమైన ఇబ్బందులు వస్తే మంత్రులే భరించాలి"అని,  "దీనికి సిద్ధపడిన వాళ్లు మాత్రమే మంత్రులుగా ప్రమాణం చెయ్యాలని కేసీఆర్ గారు మెలిక పెట్టారట.ఈ షరతులకు అంగీకరించని హరీశ్ రావు గారి లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది" అని వరుస ట్వీట్లు చేశారు.

"కేసీఆర్ గారి కేబినెట్లో మంత్రులను రబ్బర్ స్టాంప్ లా వాడుకుంటారని తెలుసు కానీ... ప్రభుత్వం చేసే అవినీతికి ఏజెంట్లుగా మార్చాలనుకోవడం దారుణం" అని మరో వ్యాఖ్య చేశారు. విజయశాంతి చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.






More Telugu News