Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘కనీస ఆదాయ భద్రత పథకం’ అమలు అసాధ్యం: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్

  • రాహుల్ ప్రకటించిన పథకం అమలు అసాధ్యం
  • అంత వెసులుబాటు భారత్ వద్ద లేదు
  • రైతులకు ప్రధాని రూ. 6 వేలు ఇవ్వాలనుకోవడం భేష్

తాము అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయ భద్రత కల్పించే పథకం తీసుకొస్తామన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటనపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ నీళ్లు చల్లారు. ఇది కూడా ‘గరీభీ హఠావో’ లాంటి నినాదమేనని, ఈ పథకం అమలు అసాధ్యమని తేల్చి చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేసేంత వెసులుబాటు భారత్ వద్ద లేదని, అది ఎలా అమలు చేస్తారో చెప్పాలని కాంగ్రెస్‌ను నిలదీశారు.

ఈ పథకాన్ని తానైతే సమర్థించబోనని పేర్కొన్న రాజీవ్ కుమార్.. సామాజిక భద్రతకు ప్రోత్సాహకాలు ఇచ్చేకంటే వారికి ఉపాధి మార్గాలు కల్పించడమే మంచిదని సూచించారు. చైనా వంటి దేశాలు ఈ విషయంలో ముందడుగు వేశాయన్నారు. రాహుల్ కనీస ఆదాయ పథకాన్ని విమర్శించిన రాజీవ్ కుమార్.. ప్రధాని మోదీ ప్రకటించిన ‘పీఎం కిసాన్ నిధి సమ్మాన్ యోజన’ను మాత్రం ప్రశంసించారు.

రైతుల నెలసరి ఆదాయం మూడు నాలుగు వేల రూపాయల లోపే ఉంటుందని, అటువంటి వారికి నెలకు రూ.500 ఇవ్వడాన్ని తీసిపారేయలేమన్నారు. ఈ మొత్తాన్ని రైతులు ఏదో ఒకదానికి ఉపయోగించుకుంటారని అన్నారు.

More Telugu News