timber dipos bandh: 55వ నంబర్‌ జీవోకు తక్షణం సవరణలు చేయాలంటూ తెలంగాణ టింబర్‌ మర్చంట్స్‌ డిమాండ్‌

  • తెలంగాణలో 3 లక్షల కుటుంబాలకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధికి దెబ్బని ఆవేదన
  • నేటి నుంచి మూడు రోజులపాటు డిపోల బంద్‌
  • వాల్టాపై ఆన్‌లైన్‌ అనుమతులు ఎత్తివేయాలని వేడుకోలు

‘తెలంగాణలో కలప ఆధారిత పరిశ్రమలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి మూడు లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. కేంద్ర అటవీ విధానం కాకుండా తెలంగాణ ప్రభుత్వం 2016లో అమల్లోకి తెచ్చిన 55వ నంబరు జీవో ఈ కుటుంబాల జీవనోపాధికి శరాఘాతంగా మారింది. వ్యాపారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. తక్షణం ఈ జీవోకు సవరణలు చేయాలి’ అని ది తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ టింబర్‌ మర్చంట్స్‌ అండ్‌ సా మిల్లర్స్‌, అలైడ్‌ ఇండస్ట్రీస్‌ డిమాండ్‌ చేసింది. తక్షణం  జీవోకు సవరణలు కోరుతూ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు డిపోలు బంద్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సికింద్రాబాద్‌లో నిర్వహించిన అసోసియేషన్‌ సమావేశంలో ప్రకటించింది. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ‘జంగిల్‌ బచావో...జంగిల్‌ బడావో’ కార్యక్రమాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు.

అయితే అటవీ శాఖ విధించిన నూతన ఆంక్షలకు వ్యతిరేకంగా 55వ నంబరు జీవోలో సవరణలు చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. వాల్టాపై ఆన్‌లైన్‌ అనుమతి ఎత్తివేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా వేప, తుమ్మ, మామిడి వంటి చెట్లకు రూ.450కి బదులు రూ.50లు ఫీజు వసూలు చేయాలని సమావేశం కోరింది. రైతుల పట్టాభూముల్లోని టేకుచెట్లు కొనుగోలు చేస్తే రవాణాకు వారం రోజుల్లో అనుమతించాలన్నారు.

కార్పెంటర్ల వివరాలు నమోదు చేయడానికి పర్మిట్లలో సవరణలు చేయాలన్నారు. ఇప్పుడున్న విధంగానే జీవోను అమలు చేస్తే కలప ఉత్పత్తుల వ్యాపారులు, దానిపై ఆధారపడే ఇతర కుటుంబాలు కూడా రోడ్డున పడాల్సి వస్తుందని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పి.గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News