modi: గురువుకే పంగనామాలు పెట్టిన చరిత్ర మోదీది: చంద్రబాబు

  • అద్వానీ నమస్కారం పెడితే.. తిరిగి నమస్కరించని సంస్కారం మోదీది
  • దేశాన్ని, రాష్ట్రాలను కలుషితం చేస్తున్నారు
  • 12 ఏళ్లు సీఎంగా ఉండి.. అహ్మదాబాద్ కు ఏం చేశారు?

ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. దివంగత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచానని తనను మోదీ విమర్శిస్తున్నారని... గురువుకే పంగనాలు పెట్టిన చరిత్ర మోదీదని మండిపడ్డారు. అద్వానీ నమస్కారం పెడితే తిరిగి నమస్కరించని సంస్కారం ఆయనదని విమర్శించారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను ఏర్పాటు చేసినట్టు మోదీ చెప్పారని... కియా మోటార్స్ కూడా కేంద్రమే ఇచ్చినట్టు చెబుతున్నారని మండిపడ్డారు. దేశాన్ని, రాష్ట్రాలను మోదీ కలుషితం చేస్తున్నారని... వ్యక్తిగత ప్రయోజనాల కోసం మోదీ పాకులాడుతున్నారని విమర్శించారు. దేశ ప్రయోజనాల కోసం తాను ముందుకు వెళ్తున్నానని చెప్పారు. మోదీ కాపలాదారు కాదని, దగాకోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ఉన్న పెట్రోలియం ఉత్పత్తులను దోచుకోవడానికి మోదీ యత్నిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఏపీకి వచ్చిన మోదీ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా, తనను తిట్టి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. దేశ వృద్ధి రేటు కంటే రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉందని అన్నారు. 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ అహ్మదాబాద్ కు ఏం చేశారని ప్రశ్నించారు. హైదరాబాదుకు, అహ్మదాబాదుకు పోలిక ఉందా? అని అడిగారు. అనుభవం లేని ఓ ప్రైవేట్ వ్యక్తికి యుద్ధ విమానాలను తయారు చేసే కాంట్రాక్ట్ ఇచ్చారని విమర్శించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా మోదీ మభ్యపెట్టారని విమర్శించారు.

More Telugu News