sm krishna: నేను కాంగ్రెస్ ను వీడటానికి రాహుల్ గాంధీనే కారణం: మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ

  • రాహుల్ విపరీతమైన జోక్యాన్ని భరించలేక పోయాను
  • కేవలం ఎంపీగానే ఉన్న రాహుల్ అన్ని విషయాల్లో కలగజేసుకునేవారు
  • మన్మోహన్ కు తెలియకుండానే అనేక నిర్ణయాలు తీసుకునేవారు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడటానికి రాహుల్ గాంధీనే కారణమని ఆయన అన్నారు. ప్రతి అంశంలో రాహుల్ కల్పించుకుంటూ ఉండటమే దానికి కారణమని ఆయన చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ అధినేత కానప్పటికీ రాహుల్ చాలా ఎక్కువగా జోక్యం చేసుకునేవారని విమర్శించారు. రాహుల్ విపరీతమైన జోక్యాన్ని తాను భరించలేకపోయానని చెప్పారు.

80 ఏళ్లకు చేరువైన సీనియర్లంతా పార్టీ కార్యాలయంలో ఎలాంటి పదవుల్లో ఉండరాదని రాహుల్ చెప్పారని... అది విని తాను పార్టీని వీడానని కృష్ణ తెలిపారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు తాను విదేశాంగ మంత్రిగా ఉన్నానని... ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. 80 ఏళ్లకు చేరుకున్న వారు మంత్రి పదవుల్లో ఉండరాదని రాహుల్ ఆదేశించారని... దాంతో అప్పటికే మూడున్నరేళ్లుగా మంత్రి పదవిలో ఉన్న తాను... నిరాశతో రాజీనామా చేశానని తెలిపారు.

మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు కేవలం ఎంపీగానే ఉన్న రాహుల్ గాంధీ అనేక విషయాల్లో కలగజేసుకున్నారని కృష్ణ విమర్శించారు. పార్టీలో ఎలాంటి పదవిలో లేని రాహుల్ గాంధీ అన్ని విషయాల్లో కలగజేసుకోవడం తనకు నచ్చలేదని చెప్పారు. మన్మోహన్ దృష్టికి వెళ్లకుండానే, అనేక నిర్ణయాలు తీసుకునేవారని తెలిపారు.

 సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న ఇతర పార్టీలపై కాంగ్రెస్ కు నియంత్రణ ఉండేది కాదని... బలమైన నాయకత్వం లేకపోవడం వల్లే 2జీ స్పెక్ట్రమ్, కామన్ వెల్త్, బొగ్గు తదితర కుంభకోణాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. దేశం బాగుపడేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని అవినీతిరహిత ప్రభుత్వం మరో ఐదేళ్ల పాటు ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. 2017 మార్చి లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో ఎస్ఎం కృష్ణ చేరారు. కాంగ్రెస్ ను వీడిన తర్వాత ప్రజా సోషలిస్ట్ పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

More Telugu News