Telangana: సొంత కులం అభ్యర్థికి ఓటేయలేదని కులబహిష్కరణ చేసిన పెద్దలు!

  • తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘటన
  • లొత్తూనూర్ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్
  • మరో వ్యక్తికి ఓటేశారని ఓడిపోయిన అభ్యర్థి ఆగ్రహం

తమకు ఓటేయలేదన్న అక్కసుతో ఓ కుటుంబాన్ని కులబహిష్కరణ చేసిన ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగి ఐదు రోజులు అవుతున్నా, అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని గొల్లపల్లి మండలం లొత్తునూర్‌ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఈ ఎన్నికల్లో ఇద్దరు మాదిగ, ఐదుగురు మాల సామాజికవర్గానికి చెందిన మహిళలు పోటీ పడ్డారు.

ఈ ఎన్నికల్లో మాల సామాజికవర్గానికి చెందిన మహేశ్వరి విజయం సాధించారు. అయితే దొనకొండ తిరుపతి కుటుంబం ఓటేయకపోవడం వల్లే తాను ఓడిపోయానని మాదిగ సామాజికవర్గానికి చెందిన ఓరుగంటి శాంత ఆరోపించింది. సొంత సామాజికవర్గానికి కాకుండా మరొకరికి తిరుపతి కుటుంబ సభ్యులు ఓటేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కులపెద్దలతో పంచాయితీ పెట్టించి పొదుపు సంఘంలో దాచుకున్న రూ.3 వేలను వెనక్కు ఇప్పించింది. ఈ సందర్భంగా తిరుపతి కుటుంబాన్ని బహిష్కరించిన కులపెద్దలు వీరితో ఎవ్వరూ మాట్లాడరాదని స్పష్టం చేశారు.

తప్పును ఒప్పుకుని కులానికి చెందిన ప్రతీ ఇంటికి వెళ్లి అందరి కాళ్లు మొక్కి క్షమాపణలు కోరితే వెలివేతను ఎత్తివేస్తామని తేల్చిచెప్పారు. దీంతో తిరుపతి కుటుంబం మానసిక క్షోభతో కుమిలిపోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కాగా, ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది.

More Telugu News