Roja: నిన్నొకటి, నేడొకటి, రేపు మరో పార్టీతో చంద్రబాబు: రోజా విసుర్లు

  • ఎన్నికల వేళ ఓట్ల కొనుగోలు
  • నిన్నటివరకూ మోదీతో అంటకాగిన చంద్రబాబు
  • ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు
  • ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్న రోజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, పథకాల పేరు చెప్పి చంద్రబాబునాయుడు ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. ఈ ఉదయం తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె, నిన్నటివరకూ బీజేపీతో అంటకాగిన చంద్రబాబు, నేడు కాంగ్రెస్ తో కలిసి తిరుగుతున్నారని, రేపు మరో పార్టీతో కలుస్తారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఓట్ల కొనుగోలు ప్రక్రియ బహిరంగంగా సాగుతోందని, ఈసీ దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేసిన రోజా, పెన్షన్ల పెంపు పేరిట వృద్ధులకు, 'పసుపు - కుంకుమ' అంటూ మహిళలను చంద్రబాబు మధ్యపెడుతున్నారని నిప్పులు చెరిగారు. డబ్బులు పంచుతూ టీడీపీకి ఓటు వేయాలని ఆయన మనుషులు అడుగుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.

మహిళలు అత్యంత పవిత్రంగా భావించే కుంకుమ, పసుపు పవిత్రతను ఏపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, తీసుకున్న రుణాలను మాఫీ చేయకుండా చెక్కులు ఇచ్చి మహిళలను మోసం చేస్తున్నారని రోజా ఆరోపించారు. ఇచ్చిన చెక్కులు క్యాష్ కావడం లేదని, చాలా చోట్ల పాత బకాయిల నిమిత్తం వాటిని బ్యాంకులు తీసేసుకుంటున్నాయని విమర్శించారు. హోదా కంటే ప్యాకేజీయే ముద్దని అసెంబ్లీలో తీర్మానం చేయించిన చంద్రబాబు, ఇప్పుడు ఎన్డీయేలో నుంచి బయటకు రాగానే డ్రామాలు ప్రారంభించారని, ఇప్పటికైనా చంద్రబాబు అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూడటాన్ని మానుకోవాలని సూచించారు.

More Telugu News