Rythu Bandhu Scheme: రైతు బంధు పథకం తాత్కాలికమే: తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి

  • రైతు బంధు రాజకీయ పరమైన నిర్ణయమే
  • రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించే వరకు మాత్రమే కొనసాగుతుంది
  • స్పష్టం  చేసిన సి.పార్థసారథి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి బాంబు పేల్చారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు పథకం తాత్కాలికమేనని తేల్చి చెప్పారు. ఇది ఎప్పటికీ కొనసాగే అవకాశం లేదన్నారు. రైతులకు ఉపశమనం కలిగించేందుకు తాత్కాలికంగా ప్రవేశపెట్టిన పథకం మాత్రమేనని తేల్చి చెప్పారు. రైతులకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించేంత వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రైతు బంధు పథకంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ రైతుకు ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున ఏడాదిలో రెండుసార్లు అందిస్తోంది. అద్భుతమైన ఈ పథకాన్ని కేంద్రం కూడా పరిగణనలోకి తీసుకుంది. ఇటువంటి పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించింది. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పేరుతో ఐదెకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు ఏడాదికి మూడుసార్లు చొప్పున మొత్తంగా ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

‘‘ నిజానికి ఇది (రైతు బంధు పథకం) రాజకీయపరమైన నిర్ణయమే. అయితే, ఇది శాశ్వత పథకం మాత్రం కాదని నేను చెప్పదలచుకున్నా. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాగునీరు వంటివి పూర్తిస్థాయిలో కల్పించేంత వరకు మాత్రమే ఈ పథకం కొనసాగుతుంది’’ అని పార్థసారథి స్పష్టం చేశారు. అయితే, ఇందుకోసం ఏమైనా డెడ్‌లైన్ పెట్టుకున్నదీ , లేనిదీ వెల్లడించలేదు.

More Telugu News