Jabardast: శ్రీకాకుళంలో బౌన్సర్ల దాడికి నిరసనగా.. 'జబర్దస్త్' ఫేమ్ నరేష్ పై స్థానిక యువకుల దాడి!

  • కళింగాంధ్ర ఉత్సవాల సందర్భంగా డ్యాన్స్ ప్రోగ్రామ్
  • ప్రదర్శనకు వచ్చిన నరేష్ బృందం
  • గ్రీన్ రూమ్ లోకి తొంగిచూసిన యువకులు, అడ్డుకున్న బౌన్సర్లు
  • తిరుగు ప్రయాణం వేళ దాడి

జబర్దస్త్ ఫేమ్‌ నరేష్ నృత్య బృందంపై శ్రీకాకుళం జిల్లా, చిన్నబరాటం ప్రాంతానికి చెందిన కొందరు స్థానిక యువకులు దాడి చేయడంతో కేసు నమోదైంది. అంతకుముందు ఈ ప్రాంతంలో కళింగాంధ్ర ఉత్సవాల సందర్భంగా ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చేందుకు రాగా, వారు గ్రీన్ రూములో ఉన్న వేళ వివాదం చెలరేగింది. కొందరు యువకులు గ్రీన్ రూమ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, నటీనటులు, యాంకర్లకు రక్షణగా ఉన్న బౌన్సర్లు దాడిచేసి, అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.

ఆపై కార్యక్రమం సజావుగానే సాగినా, తిరుగు ప్రయాణం వేళ, మార్గమధ్యంలో కొందరు స్థానిక యువకులు వారి వాహనాలను అడ్డగించారు. తమను కొట్టి, దూషించారంటూ, వాహనాలపై దాడికి దిగారు. నరేష్ టీమ్ పై దాడి చేసిన వారిలో ఓ యువకుడిని పట్టుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ లో అప్పగించి, ఫిర్యాదు చేశారు. కాగా, జరిగిన ఘటనపై స్పందించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ దాడి చేసిన వారందరినీ అరెస్ట్ చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.

More Telugu News