My name is RaGa: ‘మై నేమ్ ఈజ్ రాగా’.. వచ్చేస్తున్న రాహుల్ గాంధీ బయోపిక్

  • ప్రకంపనలు సృష్టిస్తున్న సినిమా ట్రైలర్
  • ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు
  • బయోపిక్ కాదన్న దర్శకుడు

ప్రస్తుతం దేశంలోని చిత్ర పరిశ్రమలో ‘బయోపిక్’ల జోరు కొనసాగుతోంది. భాషలతో సంబంధం లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ‘బయోపిక్’లు వరుసపెట్టి విడుదలవుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఇటీవల విడుదలైన ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.

ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘మై నేమ్ ఈజ్ రాగా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లపై ఈ సినిమా ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే.

అయితే, ఇది జీవిత చరిత్ర కాదని, తనపై జరుగుతున్న ముప్పేట దాడి నుంచి అతడు ఎలా బయటపడగలిగాడనేదే ఈ చిత్ర ఇతివృత్తమని చిత్ర దర్శకుడు రూపేశ్ పాల్ తెలిపారు. ‘‘ఈ సినిమాను నేను బయోపిక్‌గా భావించడం లేదు. ఓటమి, వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తికి సంబంధించిన కథ ఇది. దీనిని నేను బయోపిక్‌ అనను. జీవితంలో తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్న వ్యక్తి విజయం సాధించిన తర్వాత అతడిని ఆపడం సాధ్యం కాదు.. ఇదే సినిమా కథ’’ అని  దర్శకుడు వివరించాడు. కాగా, తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 

More Telugu News