India: అందిపుచ్చుకుంటేనే సుమా... టీమిండియా ముందు చరిత్ర సృష్టించే చాన్స్!

  • నేడు హామిల్టన్ లో చివరి టీ-20
  • రెండు వారాల క్రితం ఇదే పిచ్ పై బోల్తా పడిన భారత్
  • నేడు మ్యాచ్ గెలిస్తే న్యూజిలాండ్ పై తొలి టీ-20 సిరీస్

దాదాపు ఏడాదికిపైగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించి, ఇప్పుడు న్యూజిలాండ్ లో ఉన్న భారత క్రికెట్ జట్టు ముందు ఇప్పుడు చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ న్యూజిలాండ్ లో ఒక్క టీ-20 సిరీస్ ను కూడా నెగ్గని భారత్, నేడు నిర్ణయాత్మకమైన మూడో టీ-20 ఆడనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ లు చెరో మ్యాచ్ నెగ్గిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ కు ముందు ఇండియా క్రికెట్ జట్టుకు ఇదే చివరి విదేశీ మ్యాచ్ కాగా, దీనిలో గెలిచి మానసిక స్థైర్యాన్ని నింపుకుని ఇంగ్లండ్ లో అడుగు పెట్టాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది. నేడు హామిల్టన్ లో జరిగే టీ-20 పోటీలో నెగ్గితే భారత క్రికెట్ జట్టు తొలిసారిగా న్యూజిలాండ్ సిరీస్ లో గెలిచినట్టు అవుతుంది.

కాగా, ఈ మ్యాచ్ లో భారత జట్టు తన రెండో టీ-20 మ్యాచ్ లో ఆడిన జట్టునే కొనసాగిస్తుండగా, న్యూజిలాండ్ రెండు మార్పులను ప్రకటించింది. ఆ టీమ్ లో కుగ్లీన్, ఫెర్గూసన్ స్థానంలో నీషమ్, టిక్నెర్ లకు చాన్సిచ్చింది.

ఇదిలావుండగా, న్యూజిలాండ్ పర్యటనలో భారత్ కు చేదు అనుభవాన్ని మిగిల్చిన హామిల్టన్ పిచ్ పైనే ఈ మ్యాచ్ జరగడం ఇండియాకు కాస్తంత ఇబ్బందే. దాదాపు రెండు వారాల క్రితం ఇదే పిచ్ పై ఇండియా 92 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్ మిగిల్చిన చేదు అనుభవంతో, నేడు సంపూర్ణ సత్తా చాటితేనే ఇండియా గెలిచే అవకాశాలు ఉంటాయి. పేస్ కు, స్వింగ్ కు అనుకూలించే పిచ్ పై భువనేశ్వర్, ఖలీల్, పాండ్యాలు ఎలా రాణిస్తారో వేచి చూడాలి. పిచ్ కాస్తంత స్పిన్ కు అనుకూలించినా చాహల్, హార్దిక్ లు రెచ్చిపోవడం ఖాయం. అదే జరిగితే న్యూజిలాండ్ కు ఇబ్బందులు తప్పవు.

తుది జట్ల అంచనా ఇది.
ఇండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజయ్‌ శంకర్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్, చాహల్‌.

న్యూజిలాండ్‌: సీఫెర్ట్, మున్రో, విలియమ్సన్, రాస్‌ టేలర్, మిషెల్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, సౌతీ, సోధి, టిక్నెర్‌.

More Telugu News