USA: నిశ్చితార్థం ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టి అడ్డంగా బుక్కయిన యువకుడు!

  • మూడేళ్ల క్రితం వివాహం
  • అమెరికాకు భార్య, భర్త వీసా తిరస్కరణ
  • భార్య డబ్బుతో జల్సాలు, మరో యువతితో నిశ్చితార్థం
  • అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు

ఆ ప్రబుద్ధుడికి వివాహమైంది. భార్య ఇచ్చే డబ్బుతో జల్సాలకు అలవాటు పడి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. నిశ్చితార్ధం ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టడంతో అతని గుట్టు రట్టయింది. వనపర్తి పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, రంగారెడ్డి జిల్లా అస్పల్లిగూడకు చెందిన నల్లవల్లి కిశోర్‌ రెడ్డి (30) హైదరాబాద్‌ లోని దిల్‌ సుఖ్‌ నగర్‌ లో నివాసం ఉంటూ, ప్రకాశం జిల్లాకు చెందిన గుంపు మేస్త్రీ కుమార్తెతో లవ్ లో పడ్డాడు. బీటెక్‌ చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆమెను ఆర్యసమాజ్‌ లో వివాహం చేసుకున్నాడు.

ఆపై ఆమెకు అమెరికాలో ఉద్యోగం రాగా, అక్కడికి వెళ్లింది. కిశోర్‌ రెడ్డి వీసా దరఖాస్తు మాత్రం తిరస్కరణకు గురైంది. అమెరికా వెళ్లిన భార్య, నెలకు రూ. 1.50 లక్షలు పంపుతుండగా, నాగోల్‌ లో ఓ ఫ్లాట్‌ ను తన పేర కొనుక్కున్నాడు. ఆమె పంపే డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డాడు.

ఇదిలా వుండగా, ఇటీవల ఓ ఫంక్షన్ లో కిశోర్‌ కు  వనపర్తికి చెందిన మరో యువతి పరిచయం అయింది. రెండు కుటుంబాలూ పెళ్లి గురించి మాట్లాడుకున్నాయి. తనకు వ్యాపారం ఉందని, టూ వీలర్ షోరూమ్ నిర్వహిస్తున్నానని కిశోర్ చెప్పడంతో ఆమె నమ్మింది. రూ. 20 లక్షల కట్నం, 25 తులాల బంగారం కట్నంగా ఇచ్చేందుకు నిర్ణయించుకుని ఎంగేజ్ మెంట్ జరిపించారు.

ఈ ఫోటోలను కిశోర్ ఫేస్‌ బుక్‌ లో అప్‌ లోడ్‌ చేయడంతో అవి అలా అలా అమెరికాలో ఉంటున్న భార్యకు చేరాయి. దీంతో అమ్మాయి కుటుంబీకులకు ఆమె విషయం చెప్పింది. దీంతో యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించగా, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇక భర్త దుర్మార్గాన్ని గురించి తెలుసుకున్న భార్య, విడాకులకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

More Telugu News