ఏపీ ప్రత్యేక హోదా భరోసా యాత్రకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు: రఘువీరా

09-02-2019 Sat 19:43
  • అభ్యర్థుల పేర్లను నెలాఖరులోగా ఖరారు చేస్తాం
  • మేనిఫెస్టోను కూడా సిద్ధం చేస్తాం
  • మోదీ పర్యటనకు నల్ల జెండాలతో నిరసన

ఏపీ ప్రత్యేక హోదా భరోసా యాత్రకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా హాజరవుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. ఈ యాత్రను మూడో వారంలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. నేడు ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను.. ఈ నెలాఖరులోగా ఖరారు చేస్తామని... అభ్యర్థులతో పాటు మేనిఫెస్టోను కూడా తయారు చేస్తామని తెలిపారు.

నిరుద్యోగం, రాఫెల్ కుంభకోణం, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల తమ ప్రచార అస్త్రాలని రఘువీరా పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఏపీకి తీరని అన్యాయం చేశారని, నల్ల జెండాలతో ఆయన పర్యటనకు నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకుల్ని తీసుకునేవన్నీ బ్రోకర్ పార్టీలేనని.. అవన్నీ తమకు శత్రువులేనని రఘువీరా విమర్శించారు.