Andhra Pradesh: స్పీకర్ వ్యవస్థను కోడెల దిగజార్చారు: అంబటి రాంబాబు

  • చంద్రబాబు మళ్లీ సీఎం కావాలట
  • స్పీకర్ చైర్ లో కూర్చొని ఈ వ్యాఖ్యలు చేయకూడదు
  • గతంలో ఏ స్పీకర్ కూడా ఇలా వ్యవహరించి ఉండరు

నిన్న ఏపీ అసెంబ్లీలో చివరి సమావేశం ముగిసిన సందర్భంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని, సభ్యులు మళ్లీ గెలవాలని తాను కోరుకుంటున్నానని కోడెల వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు. కోడెల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన అంశమని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ స్పీకర్ కూడా ఇలా వ్యవహరించి ఉండరని విమర్శించారు.

శాసనసభకు, సభాపతికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయని, సభాపతి తన చైర్ లో కూర్చున్నంత సేపూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. కానీ, ఇంత ఘోరంగా సభా సంప్రదాయాలను మంటగలిపిన స్పీకర్ ఎవరైనా ఉన్నారంటే, అది కోడెలేనని మండిపడ్డారు. వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన సభ్యులపై ఇంత వరకూ ఎటువంటి చర్యలు చేపట్టకపోగా, వారు ప్రసంగిస్తుంటే ఆలకించిన మహానుభావుడు స్పీకర్ కోడెల అని సెటైర్లు విసిరారు.

More Telugu News