Chigurupati Jayaram: జయరాం హత్యకేసులో మరో కీలక విషయం వెలుగులోకి.. హత్యలో ఐదుగురి పాత్ర?

  • హత్య జరిగిన సమయంలో ఐదుగురు ఉన్నట్టు పోలీసుల అనుమానం
  • ఏపీలో ఉన్న నిందితులను హైదరాబాద్‌కు తీసుకురానున్న జూబ్లీహిల్స్ పోలీసులు
  • శిఖా చౌదరిని కూడా విచారిస్తామన్న డీసీపీ

ప్రవాసాంధ్రుడు, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్యకేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జయరాంను హత్య చేసింది ఒక్కరు కాదని, ఆ సమయంలో ఐదుగురు బయటి వ్యక్తులు ఉన్నారని, అందరూ కలిసే జయరాంను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

 పెనుగులాట, పిడిగుద్దుల వల్లే జయరాం మృతిచెందినట్టు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం ఈ హత్యలో ఐదుగురు పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఏపీలో ఉన్న నిందితుల్ని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విచారించాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ కూడా తీసుకున్నారు.  

జయరాం భార్య పద్మశ్రీ పిటిషన్‌లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు పరిశీలించామని, శిఖా చౌదరిని కూడా విచారిస్తామని పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరూ తప్పించుకోలేరని డీసీపీ హెచ్చరించారు.

More Telugu News