Madhulika: కోలుకుంటున్న మధులిక.. నేడు వెంటిలేటర్ తొలగింపు

  • ఏడు గంటలపాటు శ్రమించి చికిత్స చేసిన వైద్య బృందం
  • బీపీ, పల్స్ సాధారణ స్థితికి
  • అయినా విషమంగానే పరిస్థితి

హైదరాబాద్‌లో ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక (17) కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. రెండు రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉన్న ఆమె శరీరం శుక్రవారం చికిత్సకు స్పందించినట్టు పేర్కొన్నారు. బాలిక స్పృహలోకి వచ్చిందని, బీపీ, పల్స్ సాధారణ స్థితికి చేరుకున్నట్టు చెప్పారు.

ఐదుగురు వైద్యులతో కూడిన బృందం ఏడు గంటల పాటు శ్రమించి బాధితురాలి తల, ఇతర భాగాలకు అయిన గాయాలకు చికిత్స చేశారు. విరిగిన చేతి ఎముకలకు రాడ్డు వేశారు. కత్తిగాట్లకు కుట్లు వేశారు. రక్తస్రావాన్ని పూర్తిగా నియంత్రించిన వైద్యులు ఇప్పటి వరకు పది బాటిళ్ల రక్తాన్ని బాలికకు ఎక్కించారు.

ప్రేమోన్మాది భరత్ (19) దాడికి ఉపయోగించిన కత్తి తుప్పుపట్టి ఉండడంతో తలపై అయిన గాయానికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాలిక ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నప్పటికీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, నేటి మధ్యాహ్నం వెంటిలేటర్ తొలగించనున్నట్టు తెలిపారు. మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు.

More Telugu News