Andhra Pradesh: ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ నేత కేవీపీ ఘాటు లేఖ!

  • కేసుల ఎత్తివేతను స్వాగతిస్తున్నాం
  • చంద్రబాబుకు ఇప్పటికైనా హోదా గుర్తుకు వచ్చింది
  • కేంద్రానికి బాబు  డూడూ బసవన్నలా తలూపారు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఉద్యమించిన విద్యార్థులు, వ్యక్తులపై కేసులు ఎత్తివేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్వాగతించారు. ప్రతి ఐదేళ్లకు ఎన్నికలకు పోవాలన్న నిబంధన పెట్టినందుకు తాను భారత రాజ్యాంగ నిర్మాతలతో పాటు బీఆర్ అంబేద్కర్ కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.

లేదంటే తన వెర్రి నిర్ణయాలతో ప్రజలను టార్చర్ పెట్టిన మోదీ, ఊసరవెల్లి సైతం నివ్వెరబోయేలా మాటలు మార్చిన చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొచ్చేవారే కాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఏపీ సీఎంకు కేవీపీ ఈరోజు బహిరంగ లేఖ రాశారు. ఏపీకి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే, కేంద్రానికి టీడీపీ ప్రభుత్వం డూడు బసవన్నలా తల ఊపిందని కేవీపీ రామచంద్రరావు దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కేంద్రానికి మూడు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కాకుండా ప్యాకేజీ ప్రకటించగానే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఆనందంతో ఆర్థిక మంత్రి జైట్లీకి శాలువా కప్పి, సన్మానాలు చేసి తిరుపతి ప్రసాదం ఇచ్చారని విమర్శించారు.

రాహుల్ గుంటూరు పర్యటన సందర్భంగా కార్లపై రాళ్లు, టమోటాలు, కోడిగుడ్లతో దాడి చేయాలని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయని ఆరోపించారు. అదే చంద్రబాబు ఈరోజు హోదా కోసం అసెంబ్లీలో నల్ల చొక్కాలు వేసుకున్నారని అన్నారు. కనీసం ఎన్నికల పుణ్యాన ఇప్పటికైనా చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారనీ, ఇది సంతోషకరమైన విషయమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News