Chandrababu: పార్టీనే సుప్రీం...గెలిచే వారికే టికెట్లు: చంద్రబాబు

  • రాగద్వేషాలకు అతీతంగా కేటాయింపు చేస్తాను
  • ఈ సందర్భంగా కొందరికి అన్యాయం జరిగితే జరగొచ్చు
  • నా నిర్ణయాన్ని గౌరవించి నడుచుకోవాల్సిందే

పార్టీనే సుప్రీం అని, పార్టీ నిర్ణయాన్ని అందరూ శిరసావహించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అన్నికోణాల్లో సమాచారం సేకరించిన అనంతరం రాగద్వేషాలకు అతీతంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో కొందరికి అన్యాయం, నష్టం జరిగితే జరగొచ్చని, కానీ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

టీడీపీ నేతలతో ఈరోజు ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పార్టీవల్లే హోదా వచ్చిందన్న విషయం మంత్రుల నుంచి అందరూ గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఇబ్బంది లేకుండా చూస్తానని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

ఇక ఢిల్లీలో ఈ నెల 11న ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష జరుగుతుందని, ఇందుకోసం ముగ్గురు మంత్రులతో ఏర్పాటుచేసిన కమిటీనే జనసమీకరణకు బాధ్యత వహించాలని ఆదేశించారు. దీక్షకు ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలని, వారు రాకుంటే ఏం చేయాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

More Telugu News