Crime News: కళ్లలో కారం కొట్టి... కత్తులతో నరికి... బ్యాట్‌తో చితక్కొట్టి.. శ్రీకాకుళంలో జంట హత్యలు

  • శ్రీకాకుళంలో అత్తాకోడళ్ల దారుణ హత్య
  • ఇంట్లో ఇద్దరే ఉండగా ఘోరం
  • స్థానికంగా కలకలం రేపిన సంఘటన

 శ్రీకాకుళం పట్టణంలో గురువారం సాయంత్రం వెలుగుచూసిన అత్తాకోడళ్ల దారుణ హత్య ఘటన స్థానికంగా తీవ్ర సంచలనానికి కారణమైంది. దుండగులు మృతుల కళ్లలో కారంకొట్టి, ఆపై ఒకరిని కత్తులతో నరికి, మరొకరిని క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి దారుణంగా చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

పట్టణంలోని బొందిలీపురం విజయ్‌నగర్‌ వీధిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో పాదరక్షల వ్యాపారం నిర్వహించే జిలానీ కుటుంబం నివసిస్తోంది. ఇంట్లో జిలానీతోపాటు అతని భార్య మొహరున్నీషా (35), తల్లి జూరాబాయి (70), పిల్లలు జాఫర్‌ (15), దిషన్‌ (12)ఉంటున్నారు. జిలానీ అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో దుకాణం నడుపుతున్నాడు. వ్యాపారం పనిమీద గురువారం ఉదయం పొందూరు, రాజాం ప్రాంతాలకు వెళ్లాడు. పిల్లలు పాఠశాలకు వెళ్లారు. ఇంట్లో అత్తాకోడళ్లు మాత్రమే ఉండే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు.

తొలుత మొహరున్నీషా కంట్లో కారంచల్లి అనంతరం కత్తులతో దాడిచేశారు. ఆమె మెడ, కాళ్లు, చేతులు కోసేశారు. అనంతరం వంటింట్లో ఉన్న జూరాబాయి కంట్లోను కారంకొట్టి, తర్వాత క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి చంపేశారు. దారుణమైన ఈ ఘటనలో అత్తాకోడళ్లు ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పాఠశాలకు వెళ్లిన జిలాని పెద్దకొడుకు జాఫర్‌ సాయంత్రం ఇంటికి వచ్చాక ఈ దుర్ఘటన వెలుగు చూసింది. హాల్‌లో తల్లి, వంటింట్లో నాన్నమ్మ రక్తపు మడుగులో పడి ఉండడం చూపి జాఫర్‌ స్థానికులకు సమాచారం అందించడంతో ఒక్కసారిగా సంచలనం రేగింది.

హత్యకు పాల్పడిన దుండగులు ఆ విషయం వెల్లడికాకుండా ఉండేందుకు, ఆధారాల్లేకుండా చేసేందుకు ఘటనా స్థలిలో కారం చల్లారు. అలాగే, వంటగదిలో ఉన్న పైపులైను విరగ్గొట్టి నీరు బయటకు వచ్చేలా చేశారు. దీంతో మృతుల శరీరం నుంచి వచ్చిన రక్తం కొంతమేర కొట్టుకుపోయింది. అనంతరం తలుపులు దగ్గరగా వేసి ఎంచక్కా వెళ్లిపోయారు. అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మన్‌ లేకపోవడం, సీసీ కెమెరాలు కూడా అమర్చక పోవడంతో పోలీసులకు ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. డాగ్‌స్వ్కాడ్‌ను రంగంలోకి దింపగా అది మేడ మీదికి, ప్రధాన ద్వారం వద్దకు వచ్చి కొంచెం సేపు ఆగింది.

దుండగులు హత్య చేయడంతోపాటు బీరువాలో ఉన్న కొంత నగదు, బంగారాన్ని అపహరించారని జిలానీ పోలీసులకు తెలిపాడు. భార్య, తల్లి మృతితో జిలానీ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇటీవల కాలంలో ఎప్పుడూ వ్యాపారంపై బయటకు వెళ్లలేదని, వెళ్లినప్పుడే ఈ ఘోరం జరిగిపోయిందని వాపోయాడు. కాగా చేయి తిరిగిన హంతకులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని, నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ భీమారావు తెలిపారు.

More Telugu News