Narendra Modi: లోక్‌సభలో మరోమారు మోదీపై విరుచుకుపడ్డ ఎంపీ గల్లా జయదేవ్

  • తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైంది?
  • అహంకారం వల్ల విజ్ఞత దెబ్బతింటోంది
  • మరోసారి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరు 

అవిశ్వాస తీర్మానం సమయంలో లోక్‌సభలో కేంద్రాన్ని ఏకి పారేసిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోమారు విరుచుకుపడ్డారు. లోక్‌సభలో గురువారం ఆయన మాట్లాడుతూ విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల సంగతి ఏమైందంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. నాడు ఇచ్చిన హామీల్లో నిలబెట్టుకున్నవి ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

అహంకారం వల్ల విజ్ఞత దెబ్బతింటుందని, ఫలితంగా అది అభద్రతకు దారితీస్తుందని జయదేవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీ అదే దారిలో కనిపిస్తోందన్నారు. ప్రధాని మోదీ చేతిలో మోసపోయేందుకు ప్రజలు మరోమారు సిద్ధంగా లేరన్నారు. ఒక్క ఏపీనే కాకుండా దేశం మొత్తాన్ని మోదీ మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకసారి మోసం చేస్తే మీకు సిగ్గుచేటని, రెండోసారి చేస్తే అది తమకే సిగ్గుచేటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మర్చిపోయారా? అని మోదీని నిలదీశారు. హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామన్న నాటి హామీ సంగతి ఏమైందని, ఆ మాటలు గుర్తున్నాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబును తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. మోదీ ప్రజాస్వామ్య విధ్వంసకారుడిలా మారారని గల్లా జయదేవ్ ధ్వజమెత్తారు.

More Telugu News