2G scam: గడువు కావాలా?.. ముందు 15 వేల మొక్కలు నాటండి!: ప్రతివాదులకు హైకోర్టు విలక్షణ శిక్ష

  • 2జీ కేసులో నిందితులను నిర్దోషులుగా తేల్చిన కోర్టు
  • హైకోర్టును ఆశ్రయించిన ఈడీ
  • స్పందన కోసం పదేపదే గడువు కోరడంతో న్యాయస్థానం ఆగ్రహం

2జీ కుంభకోణంలో ఈడీ దాఖలు చేసిన అప్పీలుపై ఇప్పటి వరకు స్పందన తెలియజేయకపోగా, పైపెచ్చు గడువు కావాలని కోరిన మూడు కంపెనీల ప్రతినిధులు, ఇద్దరు వ్యక్తులకు ఢిల్లీ హైకోర్టు విచిత్రమైన శిక్ష విధించింది. ఒక్కొక్కరు మూడు వేల చొప్పున మొత్తం 15 వేల మొక్కలు నాటాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే..

దేశాన్ని ఊపేసిన 2జీ కుంభకోణం కేసులో మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. డిసెంబరు 21, 2017న ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేసిన ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ దాఖలు చేసిన అప్పీలుపై స్పందనేంటో చెప్పాల్సిందిగా నిర్దోషులుగా ప్రకటించిన వారికి కోర్టు సూచించింది.

అయితే, ఈడీ పిటిషన్‌పై స్పందించేందుకు తమకు ఇంకాస్త గడువు కావాలంటూ  స్వాన్‌ టెలికం ప్రయివేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ షాహిద్‌ బల్వా, కుసేగావ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ అగర్వాల్‌, డైనమిక్‌ రియాల్టీ, డీబీ రియాల్టీ లిమిటెడ్‌, నిహార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ గతంలో పలుమార్లు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. తాజాగా, గురువారం జరిగిన విచారణలో తమకు మరింత గడువు కాలంటూ వీరు న్యాయస్థానాన్ని కోరారు.  

వారి అభ్యర్థనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వింత శిక్ష విధించింది. ఒక్కొక్కరు 3 వేల చొప్పున మొత్తం 15 వేల మొక్కలు నాటాలని, ఈ నెల 15న అటవీ అధికారి సమక్షంలో శిక్షను పూర్తి చేయాలని ఆదేశించింది. స్పందన తెలిపేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్టు పేర్కొన్న కోర్టు విచారణను వచ్చే నెల 26కు వాయిదా వేసింది.

More Telugu News