ఇంకా విషమంగానే మధులిక ఆరోగ్యం.. ఇన్ఫెక్షన్ సోకే అవకాశముందన్న వైద్యులు!

07-02-2019 Thu 15:50
  • నిన్న హైదరాబాద్ లోని బర్కత్ పురాలో దాడి
  • ప్రేమించలేదన్న అక్కసుతో యువకుడి దారుణం
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ లోని బర్కత్ పురాలో భరత్ అనే ప్రేమోన్మాది మధులిక(17) అనే ఇంటర్ అమ్మాయిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ మధులికను స్థానికులు, కుటుంబ సభ్యులు యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, మధులిక ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇంకో రోజు గడిస్తే కానీ పరిస్థితి ఏంటో చెప్పలేమని వ్యాఖ్యానించారు. గాయాల కారణంగా శరీరంలో ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

మధులిక ఇంటికి సమీపంలో ఉండే సి.భరత్‌(20) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రేమించాలంటూ రెండేళ్లుగా అతడు బాలిక వెంటపడుతున్నాడు. ఇందుకు మధులిక అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్న నిందితుడు.. బాలికపై కొబ్బరి బొండాల కత్తితో నిన్న దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మధులిక చేతి వేళ్లు తెగిపోగా, ఎడమచేతికి, మెడకు, తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో భరత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు.