'తెనాలి రామకృష్ణ .. బీఏబీఎల్' షూటింగ్ మొదలు

07-02-2019 Thu 14:32
  • నాగేశ్వరరెడ్డి నుంచి మరో కామెడీ మూవీ
  • సందీప్ కిషన్ జోడీగా హన్సిక
  • కర్నూల్ లో షూటింగ్        

హాస్య ప్రధానమైన కథా చిత్రాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డి సిద్ధహస్తుడు. 'సీమశాస్త్రి' .. 'సీమ టపాకాయ్'.. 'దేనికైనా రెడీ'.. 'ఈడో రకం ఆడో రకం' సినిమాలు కామెడీ డ్రామాపై ఆయనకి గల పట్టును ఆవిష్కరిస్తాయి. అలాంటి నాగేశ్వరరెడ్డి మరో హాస్యరసభరిత చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రంగంలోకి దిగాడు. ఆ సినిమా పేరే 'తెనాలి రామకృష్ణ ..  బీఏబీఎల్'.

ఈ సినిమాలో కథానాయకుడిగా సందీప్ కిషన్ ను ..  కథానాయికగా హన్సికను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజునే మొదలైంది. మొదటి షెడ్యూల్ ను 'కర్నూల్'లో ప్లాన్ చేశారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజుల పాటు అక్కడే షూటింగు జరగనుంది. కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సందీప్ కిషన్, ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా 'గౌతమ్ నంద' తరువాత హన్సిక చేస్తోన్న సినిమా ఇదే.