Uttar Pradesh: రూ. 4.79 లక్షల కోట్ల భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన యోగి ఆదిత్యనాథ్ సర్కార్

  • గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ 12 శాతం ఎక్కువ
  • ఎక్స్ ప్రెస్ వేలు, రోడ్ల నిర్మాణం, త్రాగునీటికి పెద్దపీట
  • గోశాలల నిర్మాణానికి రూ. 758 కోట్లు

ఉత్తరప్రదేశ్ లోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 4.79 లక్షల కోట్ల బడ్జెట్ ను అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేష్ అగర్వాల్ ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో సీఎం యోగి కూడా ఉన్నారు.

గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ. 4,28,384.52 లక్షల కోట్ల కంటే ప్రస్తుత బడ్జెట్ 12 శాతం ఎక్కువ. తన బడ్జెట్ ప్రసంగంలో పలు ప్రజాకర్షక పథకాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ వేకు రూ. 1000 కోట్లు, పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేకు రూ. 1,194 కోట్లు, బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేకు రూ. 1000 కోట్లు కేటాయించారు. కన్యా సుమన్ యోజన పథకానికి రూ. 1,200 కోట్లు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రూ. 758 కోట్లను కేటాయించారు.  

రూ. 6000 కోట్లను స్వచ్ఛ భారత్ మిషన్ కు, రూ. 247 కోట్లను గోశాలల నిర్మాణానికి, రూ. 3,488 కోట్లను జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి, రూ. 3000 కోట్లను బుందేల్ ఖండ్, వింధ్య ప్రాంతాల్లోని గ్రామాలకు పైపుల ద్వారా త్రాగునీటి సరఫరాకు కేటాయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు రూ. 6,240 కోట్లు, జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకానికి రూ. 2,954 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ. 13,135 కోట్లు కేటాయించారు. కొత్త పథకాల కోసం రూ. 21వేల కోట్లను ప్రకటించారు. 

More Telugu News