Andhra Pradesh: షాద్ నగర్ జంట హత్యల కేసులో సుప్రీం తీర్పు నేడే.. కడప జిల్లా టీడీపీలో టెన్షన్!

  • మంత్రి ఆది, రామసుబ్బారెడ్డి మధ్య ఫ్యాక్షన్ గొడవలు
  • 1990, డిసెంబర్ 5న ఆది చిన్నాన్నల హత్య
  • ప్రతీకారంగా రామసుబ్బారెడ్డి చిన్నాన్నను మట్టుబెట్టిన ప్రత్యర్థులు

ఉమ్మడి ఏపీలో 1990, డిసెంబర్ 5న సంచలనం సృష్టించిన షాద్ నగర్ జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితుడిగా కడప జిల్లా టీడీపీ నేత రామసుబ్బారెడ్డి ఉండగా, కేసు పెట్టింది మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబం కావడంతో తీర్పుపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య చాలాకాలంగా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 1990, డిసెంబర్ 5న మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌ బస్టాండ్‌ వద్ద ఆదినారాయణరెడ్డి చిన్నాన్నలయిన దేవగుడి శివశంకర్‌ రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్ రెడ్డిలను ప్రత్యర్థులు కిరాతకంగా హత్యచేశారు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు 2004లో రామసుబ్బారెడ్డిని దోషిగా తేల్చి యావజ్జీవ శిక్ష విధించింది.

ఈ తీర్పుపై రామసుబ్బారెడ్డి హైకోర్టులో సవాల్ చేసి నిర్దోషిగా బయటపడ్డారు. దీన్ని సవాలు చేస్తూ 2008లో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయింది. కాగా, ఈ దాడుల పర్వం ఇక్కడితో ఆగిపోలేదు. 1993లో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్య సాయి కల్యాణ మండపంలో రామసుబ్బారెడ్డి కుటుంబీకులు లక్ష్యంగా బాంబు దాడి జరిగింది.

ఈ ఘటనలో రామసుబ్బారెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి చనిపోయారు. ఆ తర్వాతి కాలంలో శివారెడ్డి కుమారుడు సోమశేఖర్ రెడ్డిని కడప జిల్లా మద్దనూరు వద్ద ప్రత్యర్థులు మట్టుబెట్టారు. తాజాగా మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి టీడీపీలోనే ఉండటం, వీరిద్దరూ జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పుపై కడప జిల్లా టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది.

More Telugu News