RBI: బ్యాంకు రుణాలు కడుతున్న వారికి శుభవార్త... వడ్డీ రేట్లు తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!

  • 25 బేసిస్ పాయింట్లు తగ్గిన రెపో రేటు
  • 6.50 శాతం నుంచి 6.25 శాతానికి
  • 2019-20 జీడీపీ వృద్ధి 7.4 శాతం
  • ద్రవ్యోల్బణం 3.4 శాతానికి లోపే
  • అంచనా వేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

ద్రవ్యోల్బణం దిగివచ్చి, వృద్ధి రేటు పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గిస్తూ శుభవార్త చెప్పింది. ఈ ఉదయం పరపతి సమీక్ష జరుగగా, రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగివచ్చినట్లయింది.

 తగ్గింపు ప్రయోజనాలను బ్యాంకులు వెంటనే రుణ గ్రహీతలకు అందించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. మొత్తం ఆరుగురు సమావేశం కాగా, వడ్డీ రేట్లను తగ్గించేందుకు డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య, ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇనిస్టిట్యూట్ చీఫ్ చేతన్ ఘటే లు అంగీకరించలేదు. ఆర్బీఐ చైర్మన్ సహా మిగతా నలుగురూ రెపో రేటు కట్ కు అంగీకరించారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి రేటు 7.4 శాతం వరకూ ఉంటుందని, తొలి ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.2 నుంచి 3.4 శాతం మధ్య కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు. ఇదే సమయంలో సింగిల్ ఇండియన్ కంపెనీలో ఎఫ్డీఐ పెట్టుబడులకు ఉన్న 20 శాతం పరిమితిని తొలగిస్తున్నట్టు తెలిపారు. రెపో రేటు తగ్గింపుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని నెలసరి కిస్తీలు కడుతున్న ప్రతి ఒక్కరికీ లబ్ది కలగనుంది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను తీసుకున్న వారికి కొంతమేరకు డబ్బు మిగులుతుంది.

More Telugu News