Revanth Reddy: రేవంత్ రెడ్డికి ఎంత పరిహారం ఇస్తారు?: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న

  • అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్ నిర్భంధం
  • రూపాయి పరిహారం ఇచ్చినా చాలన్న రేవంత్ న్యాయవాది
  • కేసు విచారణ 25కు వాయిదా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కొడంగల్ ప్రాంతానికి వెళ్లాలని భావించిన వేళ, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి నిర్బంధం వ్యవహారంలో ఆయనకు ఎంత ఇస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ఆసక్తికర వాదనలు సాగగా, రేవంత్‌ ది అక్రమ నిర్బంధం కాదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ అనవసరమని, దీన్ని మూసి వేయాలని అన్నారు.

దీనిపై రేవంత్ తరఫు న్యాయవాది పీవీ మోహన్‌ రెడ్డి అభిప్రాయాన్ని కోర్టు కోరగా, ఆయన తన వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం కోరుతున్నట్టుగా కేసును మూసివేస్తే, పోలీసులు పిటిషనర్‌ తో వ్యవహరించినట్లుగానే ఇతరులతోనూ వ్యవహరిస్తారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి తన క్లయింట్ కు పరిహారం ఇప్పించాలని, అది లక్ష రూపాయలు అయినా, ఒక్క రూపాయి అయినా అభ్యంతరం లేదని అన్నారు. పరిహారం చెల్లిస్తే, ప్రభుత్వం తప్పు చేసినట్లు రుజువవుతుందని అన్నారు.

ఆయన్ను అరెస్ట్ చేసేందుకు దారితీసిన పరిస్థితులను కోర్టుకు అందిస్తామని ఏజీ చెప్పడంతో విచారణను 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టీ అమర్‌ నాథ్‌ గౌడ్‌ ల ధర్మాసనం పేర్కొంది.

More Telugu News