sabarimala: ‘శబరిమల’ రివ్యూ పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ‘సుప్రీం’

  • సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ
  • ‘సుప్రీం’ తీర్పును గౌరవిస్తామన్న ట్రావెన్ కోర్ బోర్డు
  • అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం

కేరళ రాష్ట్రంలోని శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు, నాయర్ సర్వీస్ సొసైటీలతో పాటు మరికొందరు రివ్యూ పిటిషన్లు వేసిన సంగతి విదితమే. ఈ పిటిషన్లపై సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది.

ఈ విచారణ సందర్భంగా ట్రావెన్ కోర్ బోర్డు తన వైఖరిని మార్చుకుంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ట్రావెన్ కోర్ బోర్డు తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది పేర్కొన్నారు. కాగా, నాయర్ సర్వీస్ సొసైటీ, కేరళ ప్రభుత్వం కూడా తమతమ వాదనలు వినిపించాయి. శబరిమలపై ఇచ్చిన తీర్పును పున: సమీక్ష చేపట్టాల్సిన అవసరం లేదని ఆయా రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టును కేరళ ప్రభుత్వం కోరింది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం ఈ వివాదంపై తీర్పును రిజర్వ్ లో పెడుతున్నట్టు ధర్మాసనం వెల్లడించింది.

More Telugu News