paruchuri: 'విసుగొస్తోంది' అనే మాటను పవన్ వాడకూడదు: పరుచూరి గోపాలకృష్ణ సలహా

  • పవన్ అంటే నాకు ఎంతో ఇష్టం 
  • ఆయన అభిమానుల్లో నేను ఒకడిని
  •  విసుగొచ్చేలా చేయడమే రాజకీయం  

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ గురించిన ప్రస్తావన తెచ్చారు. "పవన్ కల్యాణ్ కి లక్షల్లో అభిమానులు వున్నారు .. అలాంటి అభిమానుల్లో నేను ఒకడిని. పవన్ నటన అన్నా .. ఆయన వ్యక్తిత్వమన్నా నాకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన గురించి మాట్లాడాలనిపించింది. భగవంతుడు ఒక బంగారు తివాచి వేసి .. దీనిపై నడుచుకుంటూ వెళ్లు నాయనా అంటే, జనం కోసం దాని పక్కకొచ్చి ముళ్లు గుచ్చుకుంటాయా .. రాళ్లు గుచ్చుకుంటాయా అనేది ఆలోచించకుండా ముందుకు వెళుతున్నాడు.

 ఇలాంటి పనులు అందరూ చేయలేరు. మొన్నీమధ్య ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ బాధేస్తోంది .. భయమేస్తోంది .. విసుగొస్తోంది అనే మూడు మాటలు మాట్లాడాడు. బాధ ఉండాలి .. జనానికి ఏమౌతుందోనని .. భయం ఉండాలి, నా ప్రజలకు ఏం జరుగుతుందోనని. కానీ పవన్ 'విసుగొస్తోంది' అనే మాట అనకూడదు. ఎందుకంటే విసుగొచ్చేలా చేయడమే రాజకీయం. 'పవన్ నువ్వు ఈ మార్గంలోకి ప్రేమించి వెళ్లావు .. ఏమీ ఆశించి వెళ్లలేదు .. అందువలన విసుగు అనే మాటను వాడకూడదు. అనుకున్నది సాధించేవరకూ పోరాడుతూనే ఉండాలి' అని చెప్పుకొచ్చారు. 

More Telugu News