Andhra Pradesh: ఆనందం గంటల్లో ఆవిరి... 'పసుపు - కుంకుమ' చెక్కులు తీసుకెళ్తే, షాకిచ్చిన నెల్లూరు జిల్లా బ్యాంకు!

  • పాక బకాయిలు జమ చేయాలన్న బ్యాంకు అధికారులు
  • నిరసనలకు దిగిన పొదుపు సంఘాలు
  • నెల్లూరు జిల్లా వింజమూరులో ఘటన

తమకు ఇచ్చిన రూ. 10 వేల 'పసుపు - కుంకుమ' చెక్కులను క్యాష్ చేసుకునేందుకు బ్యాంకులకు వెళ్లిన నెల్లూరు జిల్లా వింజమూరు మహిళల ఆనందం గంటల్లోనే ఆవిరైంది. మంజూరైన పది వేల రూపాయల్లో కొంతమేరకు బకాయికింద జమ చేసుకుంటామని చెబుతూ బ్యాంకు మేనేజర్ చెప్పడంతో, షాక్ నకు గురైన మహిళలు, ధర్నాకు దిగారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఒక్కో పొదుపు మహిళకూ రూ. 10 వేల చొప్పున ఏపీ సర్కారు చెక్కులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని బ్యాంకుల్లో వేసుకుని, నేరుగా డబ్బు తీసుకోవచ్చని కూడా మంత్రులు స్పష్టం చేశారు. దీంతో ఎంతో ఆశతో బ్యాంకుకెళ్లిన మహిళలు, అధికారులు చెప్పిన మాటతో అవాక్కైన పరిస్థితి.

మహిళలు రోడ్డుపై ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పేందుకు నానా తంటాలూ పడ్డారు. ఇక ఇదే విషయమై బ్యాంకు అధికారులను సంప్రదించగా, పలు పొదుపు సంఘాల గ్రూప్ లు బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని తిరిగి చెల్లించలేదని, అందువల్లే కొంత మొత్తాన్నైనా జమ చేయాలని కోరామని అన్నారు. అయితే, ఈ విషయంలో అధికారుల నుంచి మాత్రం తమకు ఎటువంటి ఆదేశాలూ రాలేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News