సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ లో ప్రేమజంటపై దాడి... యువతిని ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం!

05-02-2019 Tue 09:07
  • శ్రీసిటీ సెజ్ లో పనిచేస్తున్న యువజంట
  • స్టేషన్ లో కూర్చుని మాట్లాడుకుంటుండగా చుట్టుముట్టిన దుర్మార్గులు
  • పోలీసుల అదుపులో నలుగురు యువకులు
రైల్వేస్టేషన్ లో ఒంటరిగా కూర్చుని మాట్లాడుకుంటున్న ప్రేమికులపై దాడి చేసిన కొందరు దుర్మార్గులు, ప్రేమికుడిని దారుణంగా కొట్టి, ఆమెను తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన ఓ యువకుడు శ్రీ సిటీ సెజ్ లోని ఓ మొబైల్‌ కంపెనీలో టెక్నీషియన్‌ గా పని చేస్తుండగా, గతంలో అక్కడే పనిచేసి, ప్రస్తుతం మరో కంపెనీలో ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన యువతి పరిచయమైంది.

ఇద్దరూ ప్రేమలో పడి, తరచూ కలుసుకునేవారు ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరూ, సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ సమీపంలోని గూడ్స్ షెడ్ వద్ద ఉండగా, వీరిని గమనించిన ఐదుగురు వారిని చుట్టుముట్టారు. యువకుడిని రాళ్లతో కొట్టారు. ఆమెను లాక్కెళ్లారు. ఏడుస్తూ, అక్కడే ఉండిపోయిన యువకుడిని గస్తీ నిమిత్తం వచ్చిన పోలీసులు విచారించగా, విషయం చెప్పాడు. పోలీసులు గాలించినా, ఫలితం లేకపోయింది.

యువతిని ఓ వాహనంలో తడవైపు తీసుకెళ్లిన దుర్మార్గులు, అక్కంపేట రైల్వేస్టేషన్‌ దగ్గర వాహనం ఆపి ఆత్యాచారం చేశారు. తెల్లవార్లూ ఈ దుర్మార్గం సాగింది. ఆమెను వివస్త్రను చేసి, రైలు పట్టాలపై నడిపించి తమ పైశాచికానందాన్ని తీర్చుకున్నారు. ఆపై ఆమెను, సూళ్లూరుపేట వైపు వెళ్లే రైలు ఎక్కించి, వారు పారిపోగా, ఆమె, తన రూముకు వెళ్లి, ఫ్రెండ్ ఫోన్ తీసుకుని ప్రియుడికి విషయం చెప్పింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించగా, ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆపై విస్తృతంగా గాలింపు జరిగి, ఐదుగురు నిందితుల్లో నలుగురిని నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.