Magha Masam: మాఘమాసం వచ్చేసింది... ఎన్నో శుభముహూర్తాలు... ఒక్కటికానున్న లక్షలాది జంటలు!

  • నేటి నుంచి మొదలైన మాఘ మాసం
  • 8, 9, 10, 11 అత్యంత శుభ దినాలు
  • నెలాఖరు వరకూ మంచి ముహూర్తాలు

"మాఘ మాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్లో..." అని రోజులు లెక్కించుకోవాల్సిన అవసరం ఇక లేదు. వివాహమైనా, నూతన గృహ ప్రవేశమైనా, కొత్త వ్యాపారమైనా, ఇంటి నిర్మాణానికి శంకుస్థాపనైనా... ఎన్నో మంచి శుభ ముహూర్తాలను మోసుకుంటూ మాఘ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వివాహాల సందడి ప్రారంభం కానుండగా, లక్షలాది జంటలు మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నాయి. ఇదే నెలలో 12వ తేదీన రథసప్తమి, 16వ తేదీన భీష్మ ఏకాదశి, ఆపై మార్చి 4న మహా శివరాత్రి పర్వదినాలు కూడా ఉన్నాయి.

మార్గశిర బహుళ నవమి... అంటే డిసెంబర్ 30తో ముహూర్తాలు ముగిసిపోగా, ఆపై 35 రోజుల తరువాత శుభముహూర్తాల సీజన్ తిరిగి మొదలైంది. ఈ నెలలో 8, 9, 10, 11 అత్యంత శుభ దినాలని, ఆపై కూడా నెలాఖరు వరకూ మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలు, పట్టణాల్లోని ఫంక్షన్ హాల్స్ మాఘ మాసం కోసం బుక్ అయిపోయినట్టు తెలుస్తోంది. వివాహాల నేపథ్యంలో పురోహితులతో పాటు క్యాటరింగ్ చేసే సంస్థలకు, బాజా భజంత్రీలకు, ఈవెంట్ మేనేజర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

More Telugu News