west bengal: పశ్చిమబెంగాల్ లో రాష్ట్రపతి పాలన.. హింట్ ఇచ్చిన కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్

  • రాజ్యాంగానికి లోబడి రాష్ట్రాలు పని చేస్తే బాగుంటుంది
  • ఆర్టికల్ 356ను మైండ్ లో పెట్టుకోవాలి
  • పరోక్ష హెచ్చరికలు జారీ చేసిన బీరేంద్ర సింగ్

పశ్చిమబెంగాల్ లో నెలకొన్న రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు బంధించడం... ఆ తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నాకు దిగడం వేడి పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. రాష్ట్రాలను అణగదొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, పశ్చిమబెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్టుగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజ్యాంగానికి లోబడి రాష్ట్రాలు పని చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. లేనిపక్షంలో ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన)ను దృష్టిలో పెట్టుకోవాలని పరోక్షంగా హెచ్చరించారు.

మరోవైపు టీఎంసీ ఎంపీ సౌగథ రాయ్ పశ్చిమబెంగాల్ అంశాన్ని లోక్ సభలో లేవనెత్తారు. వ్యవస్థలను నాశనం చేసే విధంగా మోదీ, అమిత్ షాలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News