dhoni: ధోనీని దృష్టిలో ఉంచుకుని బ్యాట్స్ మెన్ కు కీలక సలహా ఇచ్చిన ఐసీసీ!

  • వయసు పెరుగుతున్నా ధోనీలో తగ్గని చురుకుదనం
  • నీషమ్ ను ధోనీ స్టంపింగ్ చేసిన వీడియో వైరల్
  • స్టంపింగ్ లలో ధోనీ దరిదాపుల్లో కూడా మరెవరూ లేరు

వయసు పెరుగుతున్నా టీమిండియా లెజెండరీ క్రికెటర్ ధోనీలో చురుకుదనం ఏ మాత్రం తగ్గడం లేదు. వికెట్ కీపర్ గా ధోనీ చేస్తున్న కళ్లు చెదిరే డిస్మిసల్స్ చూస్తే 'వారెవ్వా' అనాల్సిందే. ఈ నేపథ్యంలో అన్ని జట్ల బ్యాట్స్ మెన్ కు ఐసీసీ కీలక సూచన చేసింది. 'వికెట్ల వెనుక ధోనీ ఉన్నప్పుడు... క్రీజు దాటి ముందుకు వచ్చే ప్రయత్నం చేయకండి' అని సూచించింది.

న్యూజిలాండ్ తో నిన్న జరిగిన చివరి వన్డేలో ధోనీ మెరుపు వేగానికి కివీస్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరిన తీరు అందరినీ ఆకట్టుకుంది. 44 పరుగులతో అప్పటికే నీషమ్ క్రీజులో పాతుకుపోయాడు. కేదార్ జాధవ్ వేసిన బంతిని నీషమ్ మిస్ అయ్యాడు. అయితే, ఆ బంతి నీషమ్ కాలికి తాకడంతో భారత్ ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశారు. ఇదే సమయంలో నీషమ్ క్రీజు బయటకు వచ్చాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బంతిని అందుకున్న ధోనీ... వికెట్లను గిరాటేశాడు. ఏం జరిగిందో అర్థం కాని స్థితిలో నీషమ్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో ధోనీని ఎదుర్కోవడం ఎలా అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ఐసీసీ సలహా అడిగాడు. ఈ ట్వీట్ పై స్పందించిన ఐసీసీ... ధోనీ వికెట్ల వెనుక ఉన్నప్పుడు... క్రీజును వదిలి వెళ్లవద్దంటూ బ్యాట్స్ మెన్ కు సూచించింది. అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ ఇప్పటి వరకు 190 స్టంపింగ్ లు చేశాడు. అతని దరిదాపుల్లో కూడా మరెవరూ లేరు. ధోనీ తర్వాత శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (139 స్టంపింగ్ లు) ఉన్నాడు.

More Telugu News