cold waves: ఉత్తర కోస్తాపై చలి పంజా...గజగజ వణుకుతున్న జనం

  • రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు తక్కువ నమోదు
  • ఏజెన్సీలో పరిస్థితి మరింత దారుణం
  • ఒడిశా మీదుగా చలిగాలుల ప్రభావం

సంక్రాంతి వెళ్లిపోయి పక్షం రోజులు గడిచిపోయింది. ఇప్పటికే ‘అబ్బో...ఎండ దెబ్బ’ అని అనాల్సిన స్థితిలో జనం చలితో గజగణ వణుకుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలు చలితో వణుకుతున్నాయి. ఒడిశా మీదుగా వీస్తున్న అతి శీతల గాలులకు తోడు స్థానిక పరిస్థితుల కారణంగా రాత్రిపూట సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఇక శివారు ప్రాంతాలు, ఏజెన్సీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. శనివారం శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ జిల్లా ఏజెన్సీలో మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో శనివారం 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగిలో ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

రెండు రోజుల నుంచి ఏజెన్సీలో మంచు తీవ్రంగా కురుస్తోంది. చింతపల్లిలోని పర్యాటకుల సందర్శక స్థలం చెరువులవేనంలో పాలసంద్రాన్ని తలపించే మంచు మేఘాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శీతాకాలం ముగిసే సమయంలో గతంలో ఇటువంటి పరిస్థితి తక్కువ. చివరి రోజుల్లో ఇటువంటి అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుండడంతో సందర్శకులు భారీ సంఖ్యలో ఏజెన్సీకి తరలివస్తున్నారు.

More Telugu News