Jayaram: జయరాం హత్యకేసులో కీలక విషయాన్ని వెల్లడించిన పోస్టుమార్టం రిపోర్ట్!

  • మృతదేహాన్ని తరలించేందుకు రెండు కార్లు
  • వేలిముద్రలు దొరక్కుండా చేసిన నిందితులు
  • కేసు మిస్టరీని ఛేదించేందుకు 10 బృందాలు

చిగురుపాటి జయరాం హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి తెలిపారు. జయరాం హత్యకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక వచ్చిందని.. దీనిలో జనవరి 31 మధ్యాహ్నమే జయరాం హత్యకు గురయ్యారని వెల్లడైందని తెలిపారు. హత్య తరువాత జయరాం మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి నందిగామ మండలం ఐతవరం శివారులో వదిలేసి వెళ్లారని తెలిపారు.

మృతదేహాన్ని తరలించేందుకు రెండు కార్లు వాడినట్టు అనుమానిస్తున్నారు. జయరాం మృతదేహాన్ని తీసుకొచ్చిన కారు స్టీరింగ్‌పై.. వేలిముద్రలు దొరక్కుండా నిందితులు జాగ్రత్త పడ్డారని త్రిపాఠి తెలిపారు. కారు స్టీరింగ్‌పై ఉన్న వేలి ముద్రలు.. జయరాం వేలి ముద్రలకు మ్యాచ్ అవడం కేసులో మరో కొత్త అంకంగా త్రిపాఠి పేర్కొన్నారు. ఈ కేసు విషయమై శిఖా చౌదరితో పాటు మరికొందరు మహిళలను ప్రశ్నిస్తున్నామని.. కేసు మిస్టరీని ఛేదించేందుకు 10 బృందాలను ఏర్పాటు చేసినట్టు త్రిపాఠి స్పష్టం చేశారు.

More Telugu News