వచ్చే ఎన్నికల్లో మాలలు టీడీపీకి మద్దతిచ్చి గెలిపించాలి: కారెం శివాజీ

02-02-2019 Sat 19:29
  • మాలల అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారు
  • క్యాబినెట్ ర్యాంకు పదవిని మాలలకు ఇచ్చారు
  • మాల మహానాడు జాతీయ కార్యవర్గ సమావేశంలో శివాజీ

వచ్చే ఎన్నికల్లో మాలలు టీడీపీకి మద్దతిచ్చి గెలిపించాలని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ కోరారు. విజయవాడలో మాల మహానాడు జాతీయ కార్యవర్గ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కారెం శివాజీని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా చేసినందుకు అభినందిస్తూ ఓ తీర్మానం చేశారు.

వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు పెంచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, రిజర్వేషన్లు పొందుతున్న వారికి ఓపెన్ కేటగిరిలోనూ ఉద్యోగావకాశాలు కల్పించాలని, వచ్చే ఎన్నికల్లో మాలలు టీడీపీకి మద్దతిచ్చి గెలిపించాలని, సీఎం చేసే పోరాటాల్లో మాలలు పాలుపంచుకోవాలని, అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సత్వరమే పూర్తి చేయాలని, బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, నియామకాల్లో రోస్టర్ విధానం అమలు చేయని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానాలతో పాటు కారెంను మంత్రి వర్గంలోకి తీసుకోవాలన్న ఏకగ్రీవ తీర్మానాన్ని ఈ సందర్భంగా చేశారు.

ఈ సందర్భంగా కారెం శివాజీ మాట్లాడుతూ, మాలల అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, క్యాబినెట్ ర్యాంకు పదవిని మాలలకు చంద్రబాబు ఇచ్చారని ప్రశంసించారు.