Kerala: 17 ఏళ్ల అమ్మాయితో 23 రోజులు అడవిలో కాపురం.. పళ్లు, ఫలాలు తింటూ గడిపిన వైనం.. ఎట్టకేలకు యువకుడికి అరదండాలు!

  • బాలికను తీసుకెళ్లి అడవిలోని గుహలో కాపురం
  • పండ్లు తింటూ 23 రోజులు నెట్టుకొచ్చిన వైనం
  • పండ్లు అమ్మేందుకు బయటకు వచ్చి పోలీసులకు చిక్కిన యువకుడు

17 ఏళ్ల బాలికతో కలిసి అడవిలో 23 రోజులు ఏకాంతంగా గడిపిన 21 ఏళ్ల యువకుడిపై కేరళ  పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ గత నెల 6న బాలిక కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. చివరికి 23 రోజుల తర్వాత ఓ అడవిలో పట్టుబడ్డాడు. తాను లేకుండా బతకలేనని బాలిక చెప్పిందని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతోనే ఆమెను తీసుకుని వెళ్లినట్టు యువకుడు పోలీసులకు తెలిపాడు.  కేరళలోని ఇడుక్కి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

గత నెల 6న మంజు (పేరు మార్చాం) అనే అమ్మాయి- జార్జ్ అలియాస్ అప్పుకుట్టన్‌ తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కొట్టాయం సరిహద్దులోని ఇలవీఝపూంచిరా హిల్‌స్టేషన్‌ సమీపంలోని అడూర్మలా అడవికి చేరుకున్న ఇద్దరూ అక్కడే కాపురం పెట్టారు. అక్కడ దొరికిన పండ్లు, కొబ్బరికాయలు తింటూ అడవిలోని ఓ పెద్ద గుహలో ఉండసాగారు. మరోపక్క, తమ కుమార్తె కనిపించడం లేదంటూ మంజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక జార్జ్‌తో కలిసి వెళ్లినట్టు గుర్తించి గాలింపు మొదలుపెట్టారు. జార్జ్‌పై అప్పటికే రౌడీ షీట్ ఉందన్న సంగతిని పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఓ మైనర్‌పై అత్యాచారం కేసులో పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదైంది.

మంజు-జార్జ్‌ జంట ఎక్కడుందో కనిపెట్టేందుకు డీఎస్పీ కట్టప్పన సారథ్యంలో పోలీసులు ఏకంగా 75 మందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మంజు ఇలావీఝపూంచిరాలో పరిధిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో స్థానికులతో కలిసి పోలీసులు అడవిలో గాలింపు మొదలుపెట్టారు. అయితే, మంజు-జార్జ్ జంట అప్పటికే ప్లేస్ మార్చేసి అడవిలో మరింత దూరం వెళ్లిపోయింది.

ఇదిలావుండగా, అడవిలో దొరికిన పళ్లను అమ్మేందుకు జార్జ్ బయటకు రాగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులను చూసి తప్పించుకునేందుకు జార్జ్ పరుగులు తీసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తర్వాత మంజును కూడా అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. ఇంతా చేస్తే.. ఇప్పుడు తమ కుమార్తెను ఇంటికి తీసుకెళ్లబోమంటూ ఆమె తల్లిదండ్రులు తేల్చి చెప్పడం కొసమెరుపు. దీంతో స్పందించిన కోర్టు బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించాల్సిందిగా ఆదేశించింది.

More Telugu News