Yadadri Bhuvanagiri District: ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల మిస్సింగ్.. పాన్‌గల్ జలాశయం వద్ద చున్నీలు

  • హాస్టల్‌లో ఇద్దరు అమ్మాయిల మధ్య పరిచయం
  • ఒకరిది యాదాద్రి, ఇంకొకరిది మహబూబ్‌నగర్
  • ఉదయ సముద్రం వద్ద చెప్పులు, చున్నీలు

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు ఇంటర్ అమ్మాయిలు అదృశ్యమైన ఘటన సంచలనం రేపుతోంది. అదృశ్యమైన అమ్మాయిల చున్నీలు ఓ చెరువు వద్ద కనిపించడంతో వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక, వారికేమైనా జరిగిందా? అన్నది మిస్టరీగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఆమన్‌గల్‌కు చెందిన రేష్మా (18), యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని చిన్న కోడూరుకు చెందిన శ్రావణి (17) ఇద్దరూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది. రేష్మ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, శ్రావణి మొదటి సంవత్సరం చదువుతోంది.

ఏడాది కాలంగా దూరంగా ఉంటున్న ఈ ఇద్దరూ ఫోన్‌లో మాత్రం టచ్‌లో ఉంటూ అప్పుడప్పుడూ కలుసుకుంటున్నారు. తాజాగా, తనకు ఆరోగ్యం బాగాలేదని శ్రావణి కాలేజీ నుంచి హాస్టల్‌కు, అక్కడి నుంచి చౌటుప్పల్‌కు చేరుకుంది. అదే సమయంలో నల్గొండలో ఉంటున్న రేష్మ కూడా ఇంట్లో సూసైడ్ నోట్ రాసి బయటకు వచ్చేసింది. అనంతరం ఇద్దరూ కలిసి పాన్‌గల్‌లోని ఉదయ సముద్రం జలాశయానికి చేరుకున్నారు.

ఆ తర్వాతి నుంచి వీరి జాడ మాయమైంది. జలాశయం వద్ద రెండు చున్నీలు, ఓ బ్యాగు కనిపించాయి. అలాగే, రేష్మా బ్యాగులో ఓ సూసైడ్ నోటు ఉంది. తన మెదడుకు దెబ్బ తగిలిందని, వైద్యానికి చాలా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. వైద్యం చేయించుకునేంత స్తోమత తమకు లేదని, వారిని బాధపెట్టడం ఇష్టంలేక చనిపోతున్నట్టు అందులో రాసింది.

జలాశయం వద్ద చున్నీలు, చెప్పులు, బ్యాగు కనిపించడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చున్నీలు, బ్యాగు స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిలు జలాశయంలో దూకేసి ఉంటారా? లేక, వాటిని అక్కడ పెట్టి ఎక్కడికైనా వెళ్లి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

More Telugu News