imterim budget: కేంద్ర బడ్జెట్ పై స్పందించిన వైఎస్ జగన్

  • ప్రజలను మోసగించడంలో పీహెచ్ డీలు తీసుకున్నారు
  • రాజకీయాలు ఎంతగా దిగజారాయో అర్థమవుతోంది
  • కేంద్రానికి బాబు లొంగిపోవడం వల్లే ఏపీకి ఈ దుస్థితి  

కేంద్ర బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ స్పందించారు.  కేంద్ర బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన వాటిపై ఎలాంటి ప్రకటనా లేదని విమర్శించారు. సీఎం చేతకానివాడైతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో చెప్పడానికి చంద్రబాబే పెద్ద ఉదాహరణ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పీహెచ్ డీలు తీసుకున్నారని, ఈ ప్రలోభాలు చూస్తుంటే రాజకీయాలు ఎంతగా దిగజారాయో అర్థమవుతోందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో కేంద్రానికి చంద్రబాబు లొంగిపోవడం వల్లే ఏపీకి ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు, ఏపీకి ప్రత్యేక హోదాను వదిలి ప్యాకేజ్ కు ఒప్పుకున్నారని మరోసారి విమర్శించారు.

నాడు అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం గొంతెత్తిన తమకు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారని చంద్రబాబుని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై మాట్లాడడానికి తమకు 30 సెకన్ల సమయం కూడా ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలో ఎవరూ లేని సమయం చూసి చంద్రబాబు భారీ డైలాగులు చెబుతున్నారని, అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా ఆయనకు లేదని దుయ్యబట్టారు. నాలుగేళ్ల పాటు కేంద్ర కేబినెట్ లో ఉన్న టీడీపీ మంత్రులు సాధించింది శూన్యమని అన్నారు. నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించని చంద్రబాబు, టీడీపీ మంత్రులు ప్రస్తుత బడ్టెజ్ పై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి అన్యాయం చేసిన పార్టీలన్నింటికీ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని జగన్ అన్నారు.

More Telugu News