cbi: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

  • పోర్ట్ బ్లెయిర్ కు బస్సీని బదిలీ చేసిన నాగేశ్వరరావు
  • జనవరి 21న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బస్సీ
  • 6 వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసిన సుప్రీం

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తనను పోర్ట్ బ్లెయిర్ కు బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ డీఎస్పీ ఏకే బస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గత అక్టోబర్ 24న అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ కు బస్సీని బదిలీ చేస్తూ నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య వివాదం నేపథ్యంలో... ఇద్దరినీ లీవ్ పై వెళ్లాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావును నియమించింది. బాధ్యతలను చేపట్టిన గంటల వ్యవధిలోనే బస్సీని నాగేశ్వరరావు బదిలీ చేశారు.

ఈ నేపథ్యంలో, తన బదిలీని సవాల్ చేస్తూ జనవరి 21న సుప్రీంకోర్టును బస్సీ ఆశ్రయించారు. ఆస్థానాపై నమోదైన ఎఫ్ఐఆర్ ను విచారిస్తున్న నేపథ్యంలో, తనపై తప్పుడు కేసులు పెట్టడం లేదా డిపార్ట్ మెంట్ విచారణను చేపట్టడం వంటి చర్యల్లో భాగంగా... తనను ఇబ్బంది పెట్టే చర్యల్లో ఇది తొలి అడుగని చెప్పారు. ఆస్థానా కేసు విచారణను ప్రభావితం చేసేలా... తన బదిలీ వెనుక భారీ కుట్ర దాగుందని ఆరోపించారు. కేసును నిష్పక్షపాతంగా విచారిస్తున్న తనను బలిపశువును చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో 6 వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు చేరీ చేసింది.

More Telugu News