Andhra Pradesh: కలియుగ దైవంతో ఆడుకోకండి.. ఆయన ఈ జన్మలోనే మీతో ఆడుకుంటాడు!: బీజేపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

  • టీటీడీపై రాజకీయం చేస్తున్నారు
  • దయచేసి ఈ చర్యలను మానుకోండి
  • బీజేపీపై మండిపడ్డ ఏపీ ముఖ్యమంత్రి

నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాకేశ్ అస్థానా ఇంటెలిజెన్స్ డీజీగా ఉండేవారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయనపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాంటి వ్యక్తిని మోదీ ఇప్పుడు సీబీఐలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారని విమర్శించారు. అందుకే సీబీఐకి ఆంధ్రప్రదేశ్ లో సమ్మతి ఉత్తర్వులను రద్దుచేశామని స్పష్టం చేశారు. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు బీజేపీ, వైసీపీల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టారు.

బీజేపీ నేతలు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఇటీవల కోర్టులకు వెళ్లడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తిరుమలపై బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. దయచేసి దేవస్థానాల జోలికి రావద్దండి. వస్తే ఆ దేవుడే చూసుకుంటాడు. కలియుగ వేంకటేశ్వరస్వామితో ఎవరైనా ఆడుకోవాలని అనుకుంటే ఆయన వారితోనే ఆడుకుంటాడు.

వచ్చే జన్మదాకా ఆగాల్సిన అవసరం లేదు. ఆయన ఈ జన్మలోనే చూసుకుంటాడు. ఈ విషయంలో నాకు బాగా నమ్మకం ఉంది’ అని తెలిపారు. హిందువులను రక్షిస్తామని చెప్పే బీజేపీ నేతలు, టీటీడీ పవిత్రతను దెబ్బతీసేందుకు వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News