Andhra Pradesh: నా జీవితంలో తొలిసారి ఈరోజు నలుపు రంగు దుస్తులను వేసుకున్నా!: సీఎం చంద్రబాబు

  • దేశంలో నేనే సీనియర్ పొలిటీషియన్
  • మోదీ 2002లో, షా నిన్న రాజకీయాల్లోకి వచ్చారు
  • నేను 1978లోనే ఎమ్మెల్యేగా గెలిచాను

2014 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా 14 సీట్లు ఇస్తే నాలుగు సీట్లలో గెలిచారని చంద్రబాబు తెలిపారు. ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదన్న సంగతి తనకు తెలుసని వ్యాఖ్యానించారు. ఎన్డీయే కన్వీనర్ గా ఉండి హిందుత్వ నేత తొగాడియా అనంతపురానికి వస్తే అరెస్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ లౌకికవాద విలువలకు కట్టుబడ్డామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నలుపు రంగు దుస్తులు ధరించి వచ్చిన సీఎం.. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే తాను జీవితంలో తొలిసారి నలుపు రంగు దుస్తులు ధరించి వచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు.

తాను నానా కష్టాలు పడి అనంతపురంలో కియా మోటార్స్ కంపెనీని తెప్పిస్తే అది తామే తెచ్చామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఏమనాలో తనకు తెలియడం లేదన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతుందని తాను బీజేపీ అగ్రనేత అద్వాణీని కలిస్తే, ఆయన మౌనంగా మారిపోయారని ఏపీ సీఎం గుర్తు చేసుకున్నారు. రాజ్యసభలో విభజన బిల్లు సందర్భంగా ‘పెద్దమ్మ(సోనియా)నే కాదు.. ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి’ అని ప్రస్తుత కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్ అన్నారని తెలిపారు.

ఏపీ అభివృద్ధి కోసం ఈ బాధలన్నీ దిగమింగానని వ్యాఖ్యానించారు. గతంలో బడ్జెట్ లో కనీసం ఏపీ పేరును ప్రస్తావించేవారనీ, ఈసారి అది కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే తాను సీనియర్ నేత అని గర్వంగా ప్రకటించుకుంటున్నానని చంద్రబాబు అన్నారు. నరేంద్ర మోదీ 2002లో సీఎం అయ్యారనీ, అమిత్ షా రాజకీయాల్లోకి నిన్న వచ్చారని తెలిపారు. కానీ తాను 1978లోనే ఎమ్మెల్యేను అయ్యానని గుర్తుచేశారు.

More Telugu News