India: మధ్య తరగతికి మోదీ వరం.. ఆదాయపన్ను పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు!

  • రూ.6.5 లక్షల వార్షిక వేతన జీవులకూ ఊరట
  • సేవింగ్స్ లో పెట్టుబడులు పెడితే పన్ను నుంచి మినహాయింపు
  • లబ్ధి పొందనున్న 3 కోట్ల మంది ఉద్యోగులు

లోక్ సభ ఎన్నికల వేళ వేతన జీవులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఇకపై రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు పన్నును చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అలాగే సంవత్సరానికి రూ.6.5 లక్షల ఆదాయం అందుకుంటున్న వ్యక్తులు ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్, ప్రభుత్వ సేవింగ్స్, ఇన్సురెన్స్ పథకాల్లో పెట్టుబడులు పెడితే ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు వస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల 3 కోట్ల మంది మధ్యతరగతి వారికి ఊరట కలుగుతుందని గోయల్ తెలిపారు.

ఉద్యోగులు, సిబ్బందికి ఈ నిర్ణయం వల్ల రూ.18,500 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. కాగా మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరట ప్రకటించిన నేపథ్యంలో పార్లమెంటులో బీజేపీ సభ్యులు మోదీ.. మోదీ.. మోదీ అంటూ నినాదాలతో, బల్లలు చరుస్తూ హోరెత్తించారు. దీంతో ప్రధాని చిరునవ్వులు చిందించారు.

More Telugu News