World Cup: క్రికెట్ వరల్డ్ కప్ దక్కేది ఈ రెండు జట్లలో ఒకరికే: డుప్లెసిస్ జోస్యం!

  • ఇండియా లేదా ఇంగ్లండ్ గెలుస్తుంది
  • మేము అంచనాలు లేకుండానే ఇంగ్లండ్ వెళుతున్నాం
  • దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్

ఈ సంవత్సరం జరిగే ప్రపంచకప్ క్రికెట్ లో ఇండియా లేదా ఇంగ్లండ్ విజేతగా నిలుస్తుందని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ జోస్యం చెప్పాడు. తమ జట్టు గతంలో భారీ అంచనాలతో బరిలోకి దిగి, చివరి మెట్టుపై బోల్తా పడిందని, ఈ సంవత్సరం మాత్రం పెద్దగా అంచనాలు లేకుండా తాము ఇంగ్లండ్ కు వెళుతున్నామని చెప్పాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన డుప్లెసిస్, పోటీలకు ఆతిథ్యమిస్తున్న ఇంగ్లండ్, ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్లలో జోరుమీదున్న ఇండియాలు ఫేవరెట్స్ అని అభిప్రాయపడ్డాడు.

తమ జట్టులో యువరక్తం ఉందని, వారంతా వరల్డ్ కప్ లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారని, వారంతా ఆత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని భావిస్తున్నానని చెప్పాడు. వరల్డ్ కప్ ను గెలుచుకుని రావాలన్న కోరికతో మాత్రం తాము ఇంగ్లండ్ కు వెళ్లడం లేదని డుప్లెసిస్ చెప్పాడు. గతంలో బలంగా కనిపించిన తమ జట్టు వరల్డ్ కప్ లో పలుమార్లు విఫలమైందని, ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ లతో పోలిస్తే, అంత బలమైన జట్టు కాదు కాబట్టి, భారీ అంచనాలను పెట్టుకోలేదని అన్నాడు. కాగా, 1992, 1999, 2007, 2015 సంవత్సరాల్లో సెమీస్ వరకూ వచ్చిన దక్షిణాఫ్రికా, ఒక్కసారి కూడా కప్ ను ముద్దాడలేదన్న సంగతి తెలిసిందే.

More Telugu News