Election commission: ఈసీ వైఫల్యంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: భట్టి విక్రమార్క

  • ఈసీ వైఫల్యంపై మా పోరాటం కొనసాగిస్తాం
  • ఈసీ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
  • ఈవీఎంలపై ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయి

తెలంగాణలో ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఈసీ వైఫల్యంపై తమ పోరాటం కొనసాగిస్తామని, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. అలాగే, ఈసీ తీరుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈవీఎంలపైన ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని అన్నారు. వీవీ ప్యాట్ల అమలు తీరుపై అనుమానం ఉందని, అనుమానాలు నివృత్తి చేసే శక్తి ఈసీకి లేనప్పుడు, తిరిగి బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని  సూచించారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు చేశారు. పాలనలో ప్రజలు కోరుకున్నవేవీ నెరవేరలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని ఆరోపించిన భట్టి, తమ ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులవుతున్నా ఇంత వరకూ కేబినెట్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని భట్టి డిమాండ్ చేశారు.

More Telugu News