India: రైలు ప్రయాణంలో ఓ యువతికి ఇబ్బందికర అనుభవం... రైల్లో శానిటరీ ప్యాడ్లు ఉంచాలంటూ పిటిషన్... అనూహ్య స్పందన!

  • 14 గంటలు నరకయాతన అనుభవించిన తాన్వీ
  • 'చేంజ్ డాట్ ఆర్గ్' మాధ్యమంగా పిటిషన్
  • చూసి స్పందించిన రైల్వే శాఖ

తాన్వీ మిశ్రా... ఇంజనీర్ గా పనిచేస్తున్న 27 సంవత్సరాల యువతి. 14 గంటల ప్రయాణం నిమిత్తం ఓ రైలు ఎక్కగా, ఆమెకు అప్పుడే నెలసరి వచ్చింది. ఆపై తన వద్ద శానిటరీ ప్యాడ్లు లేకపోవడంతో నరకయాతన అనుభవించింది. తాను పడ్డ ఇబ్బంది మరెవరూ పడరాదన్న ఉద్దేశంతో 'చేంజ్ డాట్ ఆర్గ్' మాధ్యమంగా ఓ పిటిషన్ ను ఉంచగా, వేలమంది ఆమెకు మద్దతు పలుకుతూ సంతకాలు చేస్తున్నారు.

మూడు వారాల క్రితం తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె వివరిస్తూ, "గోరఖ్ పూర్ నుంచి బయలుదేరే హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైల్లో నేను ప్రయాణించాను. పీరియడ్స్ రాగా, 'ఆక్కా నీ దగ్గర ప్యాడ్ ఉందా?' అని పక్కనున్న మహిళను అడిగాను. 'నా దగ్గర లేదు. నువ్వే వెంట తెచ్చుకోవాలిగా? రైల్లో ప్యాడ్లు ఎక్కడ దొరుకుతాయి. ఈ టిష్యూ పేపర్ తీసుకో' అన్న సమాధానం వచ్చింది.  నాకు అనుకోకుండా పీరియడ్స్ వచ్చాయి. పైగా 14 గంటల ప్రయాణ సమయం. మిగతా నా ప్రయాణ సమయాన్ని ఓ బండరాయిలా కదలకుండా కూర్చుని సాగించాల్సివచ్చింది.

ఈ ప్రయాణం తొందరగా ముగియాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కూర్చున్నాను. అప్పుడే అనిపించింది... రైల్లోనే ప్యాడ్ వెండింగ్ మెషీన్ ఉంటే బాగుండుననిపించింది" అంటూ పిటిషన్ పెట్టగా, ఇప్పటికే 8 వేల మంది సంతకాలు చేశారు. దీనిపై రైల్వే శాఖ సైతం స్పందించింది. ఇప్పటికే రైళ్లలో ప్యాడ్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. 36 రైళ్లలో ఇవి ఉన్నాయని, మిగతా రైళ్లలోనూ ఏర్పాటు చేస్తామని తెలిపింది.

More Telugu News